ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టుకున్న కేసులో తమిళనాడు రాష్ట్రంలో నాటి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలితను సీఎం పదవికి అనర్హురాలు అయ్యారని, కానీ, ఏపీలో మాత్రం ఇదే తరహా కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగారంటూ తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు. జగన్ అవినీతి కేసులపై దర్యాప్తు సంస్థలు ఎటూ తేల్చడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
ఆయన కావలిలో విలేకరులతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో జగన్‌పై 11 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయమై సీబీఐతో విచారణ చేయించారన్నారు. అదేమాదిరిగా అయోధ్య రామమందిర నిర్మాణంలో నిధులు కాజేసిన వైనంపై విచారణ జరగదా అని ప్రశ్నించారు. పాలస్తీనాలోని గాజాపై జరిగిన బాంబు దాడుల్లో 20 వేల మంది చిన్నారులు మరణించగా.. ప్రపంచం దేశాలు ఈ ఘటనను ఖండించాయన్నారు.
భారత ప్రభుత్వం మాత్రం తప్పుబట్టలేదన్నారు. అమెరికా సాగించిన ఈ మారణహోమంపై ఖండన లేకపోవడం వెనుక కుట్ర ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మిత్రుడైన అదానీ గతంలో అమెరికాలో అనేక తప్పులు చేశారన్నారు. ఆ కేసులపై ప్రభావం లేకుండా ఉండేందుకే చిన్నారులకు సంతాప ప్రకటన చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రచారం చేసుకోవడం తప్ప.. అభివృద్ధి ఊసే లేదని ఆయన మండిపడ్డారు.
Posted on 14 Jul 2026 02:06 PM
No comments yet.