మీ వకేషన్ ప్లానింగ్‌లో బడ్జెట్ ను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దేనికెంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. ఇప్పటి నుంచి ఎంత డబ్బులు ఆదా చేస్తే మన ఖర్చులు అన్నీ సరిపోను పోగవుతాయో అర్థం చేసుకొని అవగాహనకు రావాలి. అప్పుడు మీరు మీ ఖాతాల్లోని అదనపు నగదును వినియోగించాల్సిన అవసరం ఉండదు.
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రపంచంలోని అన్ని దేశాలు పర్యాటకులను ఆహ్వనిస్తున్నాయి. మీరు మీ కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ఇదే సరైన సమయం. అయితే ఇందుకోసం సరైన ప్లానింగ్ అవసరం. ముఖ్యంగ ఆర్థిక ప్రణాళిక అవసరం. ఎందుకంటే కొత్త బడ్జెట్ అమలులోకి వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మారిన నిబంధనలు, ట్యాక్స్ విధానం తదితరాలు గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా విదేశాలు వకేషన్ వెళ్లాలనుకునే వారి ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) గురించి తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టీసీఎస్ అంటే..
టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్. మీరు ఏజెంట్ వద్ద నుంచి ఏదైనా ఫారెన్ టూర్ ప్యాకెజ్ కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఈ టీసీఎస్ కు లోబడే చేయాల్సి ఉంటుంది. అందులోనే వసతి, ఆహారం, ప్రయాణ ఖర్చులు వంటివి ఉంటాయి. అయితే బడ్జెట్ 2023లో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశీ రెమిటెన్స్‌లకు టీసీఎస్ రేటు 5% నుండి 20%కి పెరిగింది. ఇది ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి వర్తిస్తుంది. ఇంతకుముందు, విదేశీ ఖర్చులు సంవత్సరానికి రూ. 7 లక్షలలోపు ఉండే వ్యక్తులు ప్లాన్ చేసిన విదేశీ పర్యటనలకు ఇది వర్తించేది కాదు . అయితే, ఈ సంవత్సరం జూలై నుండి, అటువంటి పరిమితి లేదు. అన్ని విదేశీ ఖర్చులపై 20% టీసీఎస్ వర్తిస్తుంది.
టీసీఎస్ అదనపు పన్ను కాదు.. ఇది టీడీఎస్ లాగా పనిచేస్తుంది. అయితే, ఇది మీరు నగదు ఖర్చు చేసే సమయంలో నగదు ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ టీసీఎస్ ను ఏదైనా చెల్లించాల్సిన పన్ను లేదా ముందస్తు పన్ను అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ టీసీఎస్ కారణంగా అదనపు పన్ను చెల్లింపు జరిగితే దానిని తిరిగి చెల్లిస్తారు.