టీమిండియా క్రికెటర్ హార్ధిక పాండ్యా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా ఫ్లాంట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా ఘనత సాధించాడు
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సరికొత్త రికార్డును సృష్టించాడు. మైదానంలో బ్యాట్, బాల్‌తో ప్రత్యర్థులకు చెమటలు పెట్టించే హార్ధిక్ పాండ్యా.. మైదానం బయట ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రీడాకారుల రికార్డులను తుడిచేసి తనకంటూ సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. 25 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను చేరుకున్న తరువాత ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో ఈ ఘనతను సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, ఎర్లింగ్ హాలాండ్ వంటి గ్లోబల్ స్టార్ ల కంటే హార్ధిక్ ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగిన క్రీడాకారుడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు.
హార్ధిక్ పాండ్యా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. నిత్యం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన వ్యక్తిగత, కటుంబ సభ్యుల ఫొటోలను షేర్ చేస్తుంటాడు. ఇటీవల హార్ధిక్ పాండ్యా తన సతీమణి నటాసా స్టాంకోవిక్ తో ఉదయపూర్ లో క్రైస్తవ, హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. హార్ధిక్, నటాసాకు 2020 జనవరిలోనే నిశ్చితార్ధం అయింది. కోవిడ్ కాలంకావడంతో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్యనే వీరు దండలు మార్చుకున్నారు. వీరికి అగస్త్య అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల తరువాత గత నెలలో వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హార్ధి, నాటాసా తమతమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందినందుకు పాండ్యా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నా అభిమానులందరికీ ధన్యవాదాలు. నా అభిమానుల్లో ప్రతీ ఒక్కరూ నాకు ప్రత్యేకమైనవారు. ఇన్ని సంవత్సరాలుగా వారు నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు అని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టును పంచుకున్నాడు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌లో హార్ధిక్ పాండ్యా ఎంపిక కాలేదు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కు పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలివన్డేతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.