గత ఐదు రోజుల్లో గాజాపై ఇజ్రాయెల్ దాదాపు ఆరువేలకు పైగా రాకెట్ బాంబులు ప్రయోగించింది. అయితే గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ జరిపే బాంబు దాడులలో తెల్ల భాస్వరాన్ని ఉపయోగించిందని మానవ హక్కుల సంస్థ ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఆరోపించింది.

తెల్ల భాస్వరం దాడుల వల్ల ప్రజలు తీవ్రంగా గాయపడి ఉంటారని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో గాజా ఒకటి. ఈ ప్రాంతంలో తెల్ల భాస్వరం వాడకం పౌరులకు ప్రమాదమని, ఇది అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమేనని హ్యూమన్ రైట్స్ వాచ్ అంటోంది.

ఇదే సమయంలో ‘గాజాలో తెల్ల భాస్వరం వాడకం గురించి తెలియదు” అని ఇజ్రాయెల్ సైన్యం బదులిచ్చినట్లుగా రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. మరోవైపు లెబనాన్‌లో తెల్ల భాస్వరం వినియోగంపై ఆ దేశం స్పందించలేదు.

అక్టోబరు 10న లెబనాన్, అక్టోబర్ 11న గాజాలోని సిటీ ఓడరేవు, ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని రెండు గ్రామీణ ప్రాంతాల్లో ఫిరంగిల నుంచి తెల్లటి భాస్వరం విడుదలైందని, దానికి సంబంధించిన వీడియోలు చూసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.

“పౌరులపై తెల్ల భాస్వరం ప్రయోగిస్తే దానివల్ల శరీరం కాలుతుంది, అది జీవితకాలం నొప్పిని కలిగిస్తుంది” అని హ్యూమన్ రైట్స్ వాచ్‌లోని మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా డైరెక్టర్ లామా ఫాకిహ్ చెప్పారు.

యుద్ధభూమిలో ‘స్మోక్ స్క్రీన్’ సృష్టించడం కోసం తెల్ల భాస్వరం ఫిరంగులను ప్రయోగించడం ఆపివేయాలనుకుంటున్నట్లు 2013లో ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

యుద్ధంలో తెల్ల భాస్వరం వాడకాన్ని అప్పట్లో మానవ మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.