ఒక‌వైపు సినిమాల‌తోనూ, మ‌రోవైపు త‌న ఆర్థిక వ్య‌వ‌హారాలో ఔరా అనిపిస్తోంది జాన్వీ క‌పూర్. తాజాగా జాన్వీ కపూర్ సినిమా ట్రెండింగ్ లో ఉంది. అది ఒక సౌత్ సినిమాకు రీమేక్. కొల‌మావు కోకిల అనే త‌మిళ సినిమాకు రీమేక్ గా హిందీలో రూపొందించిన సినిమాలో న‌య‌న‌తార సౌత్ లో చేసిన పాత్ర‌ను హిందీ వెర్ష‌న్లో చేసింది జాన్వీ క‌పూర్.

న‌య‌న‌తార వంటి సీనియ‌ర్ న‌టించిన పాత్ర‌కు జాన్వీ ఎంపిక కాస్త ఆశ్చ‌ర్య‌మే! అందులోనూ ఇన్నాళ్లూ జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో బండి నెట్టుకొస్తున్నా.. న‌ట‌న విష‌యంలో మ‌రీ ప్ర‌శంస‌లు ద‌క్కింది లేదు! ఇలాంటి క్ర‌మంలో.. న‌య‌న‌తార వంటి సీనియ‌ర్ హీరోయిన్ చేసిన పాత్ర‌కు చేయ‌డానికి కూడా జాన్వీ ధైర్యంగానే ముందుకొచ్చిన‌ట్టుగా ఉంది.

ఇలా సినిమా సంద‌డ‌లా ఉంటే.. 23 యేళ్ల వ‌య‌సులో 39 కోట్ల రూపాయ‌ల ప్రాప‌ర్టీ కొని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన జాన్వీ క‌పూర్, ఇప్పుడు దాన్ని అమ్మి కూడా వార్త‌ల్లో నిలుస్తోంది. సినిమాల్లోకి అలా ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్ల‌లోనే ముంబైలో అత్యంత ఖ‌రీదైన ల‌గ్జ‌రియ‌స్ ఫ్లాట్ కొన్న‌ది. 39 కోట్ల రూపాయ‌ల ధ‌ర‌కు ఆమె ఆ ఫ్లాట్ ను కొన‌డం అప్ప‌ట్లో సెన్షేష‌న్. ఇప్పుడు ఆ ఫ్లాట్ ను ఆమె 44 కోట్ల రూపాయ‌ల‌కు అమ్మేసింది. బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావ్ జాన్వీ నుంచి ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.

బాలీవుడ్ లో దూసుకుపోతున్న న‌టుడు రాజ్ కుమార్ రావ్ జాన్వీ క‌పూర్ నుంచి ఈ హ్యూజ్ ప్రాప‌ర్టీని కొనుగోలు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. మూడు నెల‌ల కింద‌ట వీరు అగ్రిమెంట్ ను రాసుకోగా.. అందుకు సంబంధించి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ డీల్ తో ముంబైలో అతి భారీ ఖ‌రీదు చేసే ల‌గ్జ‌రియ‌స్ ఫ్లాట్ ను క‌లిగి ఉన్న సెల‌బ్రిటీల జాబితాలో రాజ్ కుమార్ రావ్ చేరాడు.

ద‌ఢ‌క్ సినిమాతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన జాన్వీ క‌పూర్ ఆ త‌ర్వాత వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా కెరీర్ ను కొన‌సాగిస్తూ ఉంది. సినిమాల ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా చేతి నిండా అవ‌కాశాల‌తో సాగిపోతూ ఉంది. మ‌రోవైపు జాన్వీ క‌పూర్ కోసం సౌత్ మూవీ మేక‌ర్లు వేచి చూస్తున్న ప‌రిస్థితి ఉంది! ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే ఇక్క‌డా అవ‌కాశాల‌కు కొద‌వ‌లేన‌ట్టే. మొత్తానికి జాన్వీ క‌పూర్ దూసుకుపోతోంది!